గొప్పగా అలోచించే వాళ్ళలో ఓ రకమైన విశ్రుంఖలత్వం వుంటుంది. వీళ్ళు ముఖ్యంగా మన సనాతన ధర్మాలని ప్రశ్నిస్తారు. కానీ వీళ్ళ వాక్పటిమ ఎంతగా వుంటుందంటే, వీళ్ళు మన ఆచారాలను ప్రశ్నించినా అందులో ఏదో నిజం ఉందనుకుంటాం. ఇలాంటివాళ్ళు వితండవాదం చేసినా అది అభ్యుదయ భావాలుగల వాళ్ళకు నచ్చుతుంది. కానీ వీళ్ళని సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తారు, సరైన కారణం లేకపోయినా, ఎందుకంటే వీళ్ళ తర్కానికి వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఈ అభ్యుదయ భావాలు గల వాళ్ళు (వీళ్ళలో ఓ వర్గమే ఈ హేతువాదులు) ఇలాంటి వాళ్ళకోసమే ఎదురు చూస్తుంటారు. వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని ఆలోచించరు.
ఇలాంటి విశ్రుంఖలత్వం ఉన్నవాళ్ళలో చలం ఒకరని నాకు అనిపించింది. నేను సుజాత అనే ఒక కథ చదివాను (చలం వ్రాసింది). సుజాత భర్త గొప్ప స్వాతంత్ర్యవాది(ఇది బ్రిటిష్ కాలంలో జరిగిన కథ). సుజాత భర్త ఆమెని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఐనా ఆమె ఓ పోలీస్ తో అక్రమసంబంధం పెట్టుకుంటుంది. భర్తకి జబ్బు చేస్తుంది. అప్పుడు ఆమెకి భర్త మీడ జాలి కలుగుతుంది. భర్తకి సేవ చేస్తూ ఉంటుంది. కానీ ఈ పోలీస్ దగ్గరికి వెళ్ళడం మాత్రం మానదు. చివరగా తన తప్పు తెలుసుకుంటుంది (తెలుసుకున్నట్టు అనిపిస్తుంది), ఎలా అంటే నా భర్తని ఈ స్థితిలో వుండగా నీతో రాలేను అంటుంది. మళ్ళీ పోలీస్ మీదే మనసు ఉంటుంది ఆమెకు. ఇది మామూలుగా ఎవరైనా చెబితే ఈమె శీలం లేనిది అనే భావన కలుగుతుంది. కాని ఈ కథను చలం మలచిన తీరు చూస్తే మనకు వేరే అభిప్రాయం కలుగుతుంది. అరె ఈమె భర్తకోసం ఎంత త్యాగం చేసింది అని అనుకుంటాం చివరకి. ఇది చలం నైపుణ్యము.
చలం ఆదర్శవాదులకు నచ్చుతాడు. ఎందుకంటే వీళ్ళు సామాజిక కట్టుబాట్లగురించి ఆలోచించరు. కేవలం ఆ వ్యక్తి కోణం నుంచి ఆలోచిస్తారు. ఈమెకి కోరిక కలిగింది కాబట్టి అతనితో వెళ్ళింది అని అనుకుంటారు. ఇక్కడ శీలం అన్న పదానికి విలువ లేదు. మనకు నచ్చింది మనం చేస్తాం అనే పద్దతిలో ఉంటారు. కాని కాస్త వాస్తవికతతో ఆలోచించే సాంప్రదాయవాదులు (వీళ్ళు, ఈమె తప్పుచేసింది అనే కోణంలో ఆలోచిస్తారు ) చలాన్ని వ్యతిరేకిస్తారు. ఈ గొప్పోళ్ళంతా ఏదో సమాజం పాడైపోయింది, మనమే దీన్ని ఉద్దరించాలి అని ఉన్న సాంప్రదాయాలకి భిన్నంగా రాస్తారు. ఇలాంటివారు కొన్ని సామాజిక కట్టుబాట్లు సహేతుకంగా లేకపొయినా, వీటిపట్ల వీళ్ళు మరీ అతిగా స్పందిస్తారు, పర్యవసానాలగురించి అలోచించకుండా.

Credit: శశాంక

చలం కథలు

సీత తల్లి
ఒరెయ్ వెంకటచలం!